అభివృద్ధే బీజేపీ మంత్రం – ప్రధాని మోదీ

కర్ణాటకలోని శివమొగ్గలో సుమారు 450 కోట్లతో, గంటకు మూడొందల మంది ప్రయాణించే సామర్థ్యంతో నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. అంతకుముందు ప్రధాని మోదీ కర్ణాటకలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ఢిల్లీ నుంచి ఆర్మీ విమానంలో రాగా.. విమానాశ్రయంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప, ఇతర నాయకులు పెద్దఎత్తున చేరుకుని సాధరంగా స్వాగతం పలికారు. అనంతరం శివమొగ్గ ఎయిర్‌పోర్టును మోదీ ప్రారంభించి.. ప్రసంగించారు.

కన్నడలో ప్రధాని మోదీ ప్రసంగం..
కర్ణాటక అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని… ఆ రాష్ట్రంలోని ప్రతి పల్లెకు అభివృద్ధి ఫలాలు చేరాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తొలుత కన్నడలో ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన కర్ణాటకలోని సోదర, సోదరీమణులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జాతీయ గీతం, జయ భారత జననీయ తనుజాతే జయహే కర్ణాటక మాతే పంక్తులను పఠించారు. డబుల్ ఇంజన్‌ ఉన్న ప్రభుత్వం పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేస్తోందన్నారు. బీజేపీ లక్ష్యం కూడా అదేనన్నారు. ప్రపంచం భారత్‌వైపు చూస్తోందని మోదీ అన్నారు. ఈక్రమంలో యడయూరప్ప సేవలను ప్రధాని మోదీ కొనియాడారు. యడుయూరప్ప యాభై ఏళ్లుగా ప్రజలకు సేవ చేశారని.. బీజేపీని అట్టడుగు స్థాయి నుంచి కర్ణాటకలో నిర్మించారని మోదీ అన్నారు. దేశంలో 74 విమానాశ్రయాలను నిర్మించాంమని.. పేదలు కూడా విమానంలో ప్రయాణించాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి యడుయూరప్ప మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నో దశాబ్దాలుగా దేశాన్ని పాలించిందని.. కానీ ఎక్కడ అభివృద్ధి కనబడలేదన్నారు. ప్రపంచం మెచ్చే ఆదర్శ నేత ప్రధాని నరేంద్ర మోదీ అని అభివర్ణించారు. ఇచ్చిన హామీ మేరకు ఎయిర్‌పోర్టును నిర్మించి ఇచ్చినందుకు ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇన్నాళ్లు ప్రజా సేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన మీకు(మోదీకి) ధన్యవాదాలు అంటూ యడుయూరప్ప చెప్పడంపై పరోక్షంగా ఆయన ఎన్నికల రిటైర్మెంట్ ప్రకటించారని కొందరి వాదన.

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
శివమొగ్గ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించిన వెంటనే.. మోదీ.. మరో రెండు కీలక రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. శివమొగ్గ-షికారిపుర-రాణెబెన్నూర్ రైల్వే లైన్‌తో పాటు కొటెగంగూరు రైల్వే కోచింగ్ డిపోనకు శంకుస్థాపన చేశారు. మరో నాలుగు పథకాలను సైతం ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఇంటింటికీ నీరు ఇచ్చే పథకానికి శ్రీకారం చుట్టారు. ఇక అందులో భాగంగానే సుమారు రూ.950 కోట్ల విలువైన జల్‌ జీవన్ మిషన్‌ను మొదలు పెట్టారు. దీంతోపాటు పలు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే శివమొగ్గ విమాన టెర్మినల్‌ను కమలం పువ్వు గుర్తు ఆకారంలో నిర్మించడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *