నేడు కర్ణాటకకు ప్రధాని మోడీ.. శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించిన పీఎం!

ప్రధాని నరేంద్రమోడీ నేడు కర్ణాటక రాష్ట్రంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చెయ్యనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అంతేకాదు ఈ పర్యటనలో భాగంగా వేలాది కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.   కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో బీజేపీ వ్యూహాలకు పదును పెట్టింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా రాష్ట్రంలో అధికారాన్ని మళ్లీ చేజిక్కించుకునేందుకు ప్రధాని మోడీ రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ కర్ణాటకలో పర్యటించనున్నారు. మాజీ సీఎం యడ్యూరప్ప డ్రీమ్‌ ప్రాజెక్టుగా చెప్పుకునే శివమొగ్గ ఎయిర్‌పోర్టును ప్రధాని మోడీ ఈ రోజు లాంఛనంగా ప్రారంభిస్తారు. శివమొగ్గ ఎయిర్‌పోర్టును కమలం ఆకారంలో 450 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు. ఇది మల్నాడు ప్రాంతంలోని శివమొగ్గ, ఇతర పొరుగు ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.

శివమొగ్గ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ శివమొగ్గ విమానాశ్రయంతోపాటు, రెండు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. శివమొగ్గ-శికారిపుర-రాణేబెన్నూరు కొత్త రైల్వే లైన్, కోటేగంగూరు రైల్వే కోచింగ్ డిపోలను ప్రారంభిస్తారు. ఈ కొత్త రైల్వే లైన్‌ను రూ. 990 కోట్లు కేటాయించగా.. కోటగంగూరు రైల్వే కోచింగ్ డిపో కోసం 100 కోట్లకుపైగా వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ 215 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన బహుళ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులకు సైతం శంకుస్థాపన చేయనున్నారు. దీంతోపాటు మంత్రి జ‌ల్ జీవ‌న్ మిష‌న్ కింద 950 కోట్ల రూపాయ‌ల కంటే ఎక్కువ విలువైన బహుళ గ్రామాల ప‌థ‌కాల‌ను ప్రారంభించి, శంకుస్థాప‌న చేయ‌నున్నారు.

ఆకట్టుకుంటున్న శివమొగ్గ ఎయిర్​ పోర్ట్​..

శివమొగ్గ విమానాశ్రయంలో కమలం ఆకారంలో నిర్మించిన టెర్మినల్ పలువురిని ఆకట్టుకుంటుంది. గంటకు మూడు మంది ప్రయాణికులకు సేవలందించేలా ఈ ఎయిర్‌పోర్టును నిర్మించారు.  ఈ ఏడాదిలో ప్రధాని మోదీ ఇప్పటికే కర్ణాటకలో పర్యటిస్తుండటం ఇది ఐదో సారి. త్వరలో ఎన్నికలు జరుగుతున్న కర్ణాటక రాష్ట్రంలో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కమలం పార్టీ శక్తివంచన లేకుండా పనిచేస్తుంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *