ఈ సారి ఎవరికి ‘కాపు’ కాస్తారో?

వచ్చే ఏడాది జరగనున్న ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్దమవుతున్నాయి. ఒకవైపు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పేరుతో ప్రజల్ని నేరుగా కలుసుకుని ఈ నాలుగేళ్ల కాలంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి గురించి వారికి వివరిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకులు కూడా జనాల్లోకి వెళ్తూ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ.. తమకు అధికారం ఇస్తే ఏం చేస్తామో చెబుతూ ముందుకు వెళుతోంది. ఇక జనసేన, బీజేపీలకు రానున్న ఎన్నికలు కీలకం కావడంతో ఎలాగైనా ఈ సారి విజయం దక్కించుకోవాలని.. ఆరాట పడుతూ.. అందుకు తగినట్లు కసరత్తులు చేస్తున్నాయి. అయితే ఈ రాజకీయ పార్టీలు అన్నీ ఒకే జపం చేస్తున్నాయి. ఏపీలో దాదాపు 15 నుంచి 18 శాతం వరకు ఉన్న కాపు ఓటింగ్‌ను ఎలాగైనా తమవైపునకు లాక్కునేందుకు ఆయా పార్టీలు యత్నిస్తున్నాయి. అసలు కాపులు ఎవరికి మద్దతు ఇస్తారు… పవన్‌ను ఈసారి ఆదరిస్తారా? జగన్‌, కేసీఆర్‌, చంద్రబాబు ప్లాన్‌ ఏంటి అన్న అంశాలపై ప్రత్యేక కథనం..

ఓట్లు చీలకూడదని ఆ నాయకుడి ప్లాన్‌..
జనసేన, టీడీపీ వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తారని ఊహాగానాల నడుమ.. అధికార వైసీపీ ముందుగానే పథకాలు రచించుకుంటోంది. ఒకవేళ పొత్తు పెట్టుకోవడం అంటే జరిగితే… కాపుల ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో చీలకూడదని ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నాయకులకు సూచించినట్లు సమాచారం. వాస్తవానికి 2019 ఎన్నికల్లో సీఎం జగన్‌ వైపే కాపులు అండగా నిలిచి ఓట్లు వేశారు. దానికి తోడు మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలు పూర్తిగా మద్దతు ఇవ్వడంతో వైసీపీ 151 స్థానాల్లో గెలుపొందింది. ప్రధానం కాపు ఓట్లే లక్ష్యంగా ఆ సామాజిక వర్గానికి చెందిన అయిదుగురు ఎమ్మెల్యేలకు మంత్రి వర్గంలో సీఎం జగన్‌ చోటుకల్పించారు. దీంతోపాటు అనేక నామినేటెడ్‌ పదవుల్లో వారికి పెద్దపీట వేశారు. కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఏటా కోట్ల రూపాయలు ఆ సామాజిక వర్గానికి ఇస్తున్నారు. మరి ఇవన్నీ జగన్‌కు అనుకూలంగా మారతాయో.. ప్రతికూలం అవుతాయో వేచి చూడాల్సిందే.

యువతను ఆకర్షిస్తున్న జనసేనాని..
జనసేనాని పవన్‌కల్యాణ్‌కు యువతో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ప్రధానంగా కాపు యువకులు దాదాపు 80 నుంచి 90 శాతం మంది మద్దతుగా ఉన్నారు. అయితే వీరందరితోపాటు వారి తల్లిదండ్రులతో జనసేనకు ఓటు వేయిస్తారా లేదా అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే గత ఎన్నికల్లో పవన్‌ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడం.. ఆ పార్టీ కేవలం ఒక్కసీటు గెలుచుకోవడం చూస్తే.. పవన్‌ను రాజకీయ నాయకుడిగా ప్రజలు చూస్తున్నారా లేదా అన్న సందేహం అప్పుడప్పుడూ ప్రతి సామాన్యుడికీ కలుగుతుంది. అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయి అని చెప్పవచ్చు. గత ఓటమి నుంచి పవన్‌ వెంటనే బయటకు వచ్చారు. ప్రజలతో అప్పుడప్పుడూ మమేకం అవుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను ఆర్థికంగా ఆదుకుంటున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్నారు. దీంతో ఈ సారి కాపులందరూ ఏకమై పవన్‌ను గెలిపించాలని ఆ సంఘంలోని కొందరు పెద్దలు, యువత కోరుకుంటున్నారు. మరి వారి మాటలను ఓటర్లు వింటారో లేదో తెలియాలంటే కొన్నాళ్లు వేచిచూడాల్సిందే.

చంద్రబాబు, కేసీఆర్‌ వ్యూహం అదే..
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఎప్పటి నుంచో తమకు అండగా నిలిచిన కాపులకు మరోసారి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికల్లో తమకు మద్దతు ఇచ్చే కాపుల ఓట్లు జనసేనకు వెళ్లాయని ఆ పార్టీ భావిస్తోంది. దీంతో పవన్‌ మద్దతును మరోసారి బాబు కోరుకుంటున్నారు. అయితే.. 2014 నాటి పరిస్థితులు ఇప్పుడు లేకపోవడంతో.. జనసేనాని సీఎం కుర్చీపై కన్నేశారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తే.. సీఎం పదవి ఎవరికి ఇవ్వాలని అనే విషయంపై ఇప్పటికైతే స్పష్టత రాలేదు. టీడీపీ మాత్రం పవన్‌ను సీఎం చేసేందుకు ససేమిరా ఒప్పుకోదు. జనసేన క్యాడర్‌ కూడా అదే పట్టుదలతో ఉంది. ప్రస్తుతం ఇవన్నీ పక్కనపెట్టి ఆయా పార్టీల నాయకులు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. అప్పుడు వస్తున్న ప్రజాధరణ ఆధారంగా సీట్లు పంపకం, సీఎం కుర్చీ ఎవరికనేది ఓ స్పష్టత వస్తుంది. ఇక కాపుల ఓట్లు చేజిక్కించుకుని ఏపీలో కాలుమోపాలని కేసీఆర్‌ కూడా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌ పేరుగా మార్చి జాతీయ పార్టీని కేసీఆర్‌ స్థాపించిన సంగతి తెలిసిందే. ఇక అందులో భాగంగా కేసీఆర్‌… ఏపీలో బలమైన సామాజిక వర్గమైన కాపులకు దగ్గరకావాలని చూస్తున్నారు. అందుకే ఏపీ బీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవిని కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఐఏఎస్‌ తోట చంద్రశేఖర్‌కు ఇచ్చారు. ఇక సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌, మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ఇతర నాయకులు తమ పార్టీలో చేరాలని పరోక్షంగా కేసీఆర్‌ కోరుతున్నట్లు సమాచారం. వారి చేరిక ఖరారైతే కేసీఆర్‌ త్వరలో ఏపీకి వచ్చి బహిరంగ సభ పెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *