విశాఖే కాబోయే ఐటీ హబ్‌.. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు చురుగ్గా ఏర్పాట్లు

 

ఐటీ హబ్‌గా విశాఖ మారబోతోందని ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్‌ స్పష్టం చేశారు. వచ్చే నెల 3-4 తేదీల మధ్య విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని ఆయన తెలిపారు. పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించి కంపెనీలను నెలకొల్పడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. కేవలం 12 రోజుల్లోనే స్థలాలను కంపెనీ యాజమాన్యాలకు అందజేస్తామని, వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించేందుకు కేవలం 21 రోజుల్లోనే అనుమతులు ఇస్తామని మంత్రి పేర్కొన్నారు.

ఇదో మంచి అవకాశం..
విశాఖ ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (జీఐఎస్) 2023కు సంబంధించి శుక్రవారం హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, అమర్నాథ్‌ రోడ్‌ షో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న వైజాగ్‌లో అనేక రకాల వనరులు ఉన్నాయని దీంతోపాటు ప్రభుత్వం కూడా తోడ్పాటు అందిస్తుందని ఆర్థిక మంత్రలు తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్లను కోరారు. తమ రాష్ట్రం పరిశ్రమలకు అనుకూలమైన ప్రాంతం అని.. ఇక్కడ అపార మానవ వనరులు ఉన్నాయని వారు పేర్కొన్నారు. అవసరమైతే నిపుణుల కొరతను అధిగమించేందుకు వివిధ శిక్షణ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఐటీ, బల్క్ డ్రగ్ పార్క్, పీసీవ్ ఐఆర్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, మెరైన్, వ్యవసాయం, పునరుత్పాదకశక్తి వంటి రంగాలలో పెట్టుబడులకు ఏపీ అనుకూలమన్నారు. పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్రంలో 48 వేల ఎకరాలకు పైగా స్థలం సిద్ధంగా ఉందని మంత్రి అమర్నాథ్ తెలిపారు. పారిశ్రామికవేత్తలకు స్థలం కాకుండా సగటున 12 రోజుల్లోనే అనుమతులు లభిస్తున్నాయని తెలిపారు. కొత్తగా తీసుకొచ్చే పాలసీలో 21 రోజుల్లో స్థలాన్ని కూడా కేటాయించాలని భావిస్తున్నట్లు వివరించారు. రవాణాకు పోర్టు సదుపాయాన్ని వినియోగించుకునే అవకాశం వైజాగ్‌లో ఉందని తద్వారా విదేశాలకు సైతం సరకు రవాణా చేయవచ్చన్నారు. దీంతోపాటు ఇప్పటికే విశాఖలో ఫార్మశీ, ఇతర కంపెనీలు ఉన్నాయని త్వరలో వైజాగ్‌ ఐటీ హబ్‌గా మారుతుందని మంత్రి అమర్నాథ్‌ తెలిపారు. 974 కి.మీ. సుదీర్ఘ తీర ప్రాంతం, 534 ఇండస్ట్రియల్ ఎస్టేట్లు, 6 సెట్లు, 3 ఐటీ సెజ్‌లు, 3 పారిశ్రామిక కారిడార్లు, రెండంకెల వృద్ధి రేటుతో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అన్ని విధాలుగా అనుకూలమని పేర్కొన్నారు.

నాలుగు అంచెల భద్రతా ఏర్పాట్లు..
వైజాగ్‌లో నిర్వహించనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు నాలుగంచల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ సీహెచ్‌ శ్రీకాంత్‌ తెలిపారు. ఆరుగురు కేంద్ర మంత్రులతోపాటు వ్యాపారవేత్తుల, విదేశాల నుంచి కూడా ప్రముఖులు ఈ కార్యక్రమానికి వస్తున్నారని ఆమేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే యూఎస్, యూకే, కెనడా, దుబాయ్‌ నుంచి వ్యాపారవేత్తలు వస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. దీంతోపాటు రోజుకి సుమారు 6 వేల మంది సమ్మిట్‌లో పాల్గొనేందుకు వివరాలు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *