మీ కదలికలు గూగుల్‌కి తెలిసిపోతున్నాయ్‌!

గూగుల్ టేక్‌ అవుట్‌ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న అంశం. ప్రధానంగా ఆంధ్ర్రప్రదేశ్‌ రాజకీయాలను ఓ కుదుపు కుదిపింది అని చెప్పవచ్చు. ఎందుకంటే.. కడప జిల్లాలోని పులివెందులలో 2019 మార్చి నెలలో జరిగిన వివేకానంద రెడ్డి హత్య కేసులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీబీఐ ఆ కేసు దర్యాప్తులో గూగుల్‌ టేక్‌ అవుట్‌ సాంకేతికతను వినియోగించుకున్నాం అని చెప్పడం సంచలనంగా మారింది. దీంతో అసలు ఈ గూగుల్‌ టేక్‌ అవుట్‌ అంటే ఏమిటి? ఇది నేరస్థులను ఏ విధంగా పట్టిస్తుంది. అసలు మన వ్యక్తిగత గోప్యత ఏ మేరకు భద్రం అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందామా…

గూగుల్‌ టేక్‌ అవుట్‌ అంటే ఏమిటి.. ఎలా పనిచేస్తుంది?
సాధారణంగా ఆండ్రాయిడ్‌, ఆపిల్‌ ఫోన్లు వినియోగించే ప్రతి ఒక్కరికీ గూగుల్‌ అప్లికేషన్స్‌ గురించి తెలిసే ఉంటుంది. అయితే అన్ని అప్లికేషన్స్‌ను మనం ఉపయోగించం కానీ.. గూగుల్‌ మాత్రం మన వివరాలన్నీ ఎప్పటికప్పుడు భద్రపరుస్తుంది. ఇంటర్‌నెట్‌ సౌకర్యం ఉన్న ప్రతి ఫోన్‌లోని డేటా గూగుల్‌ నిక్షిప్తం చేస్తుంది. మనం నిత్యం వినియోగించే గూగుల్‌ డ్రైవ్‌, ఫొటోస్, గూగుల్‌ కీప్, జీపీఎస్, గూగుల్‌ మ్యాప్స్‌ ఇతర అప్లికేషన్స్‌ ద్వారా మనం ఎక్కడ ఉన్నాం.. ఎవరిని కలుస్తున్నాం అనే వివరాలు ఎప్పటికప్పుడు గూగుల్‌ రికార్డు చేస్తోంది. అయితే ఇంటర్‌నెట్‌ సదుపాయం ఉన్నా లేకున్నా.. మెబైల్‌ డేటా ఆఫ్‌ మోడ్‌లో ఉన్నా కూడా మీ లొకేషన్‌ను స్పష్టంగా తెలుసుకోవచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. జీపీఎస్ ఆన్‌-ఆఫ్‌తో సంబంధం లేకుండా క్లౌడ్‌ సర్వీసెస్‌తో మనం ఎక్కడ ఉన్నాం అనే వివరాలు తెలుసుకోవచ్చని అంటున్నారు. ఈ విషయాలన్నీ చాలా మందికి తెలియవని.. సాంకేతికత అపారంగా అభివృద్ది చెందిందంటున్నారు. ముఖ్యంగా నేరస్తుల కదలికలను గూగుల్‌ టేక్‌ అవుట్‌ మాధ్యమాన్ని వినియోగించి 100 శాతం గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. గూగుల్‌ టేక్‌ అవుట్‌ వద్ద చాలా సమాచారం ఉంటుందని.. ఇది గూగుల్‌కి డేటా సేవర్‌గా ఉపయోగపడుతుందని అంటున్నారు.

ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీలకు మాత్రమే గూగుల్‌ అనుమతి..
గూగుల్‌ టేక్‌ అవుట్‌ మాధ్యమం ద్వారా తమ వ్యక్తిగత డేటాను సామాన్యులు కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే దానికి ఓ విధానం ఉంటుందని గూగుల్‌ సంస్థకు మెయిల్‌ చేస్తే.. కొన్ని రోజుల తర్వాత అడిగిన సమాచారం ఇస్తారని అంటున్నారు. అయితే ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్‌ సంస్థలు ఏవైతే ఉంటాయో.. వాటికి మాత్రం అడిగిన వెంటనే గూగుల్‌ సంస్థ సమాచారం ఇస్తుందని చెబుతున్నారు. ప్రధానంగా భారతదేశంలోని ఓ పది సంస్థలకు ఆ సమాచారాన్ని ఇప్పటి వరకు ఇచ్చినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అందులో ఈడీ, సీబీఐ వంటి ఏజెన్సీలు ఉన్నాయన్నారు. దీని ఆధారంగా కేసులను ఛేదించే అవకాశం ఉంటుందని, నేరస్తులు దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించకుండా ఉండేందుకు గూగుల్‌ టేక్‌ అవుట్‌ నుంచి తీసుకున్న డేటా ఉపయోగపడుతుందన్నారు. దీంతో నేరస్తుల ఆటకట్టించవచ్చని చెబుతున్నారు.

మీ ఫోన్‌ మిమ్మల్ని నిత్యం గమనిస్తుంటుంది..
మీరు విన్నది నిజమే.. సాంకేతికత విస్తరించిన తరుణంలో మీ ప్రతి కదలికను ఇవాళ ఫోన్‌ రికార్డు చేస్తోంది. సముద్రం ఒడ్డున మీరు నడిస్తే ఏవిధంగా మీ పాద ముద్రలు పడతాయో అదే విధంగా మీ ఫోన్‌ మీ ప్రతి కదలికలను రికార్డు చేస్తుంది అంటున్నారు సాంకేతిక నిపుణులు. కేవలం ఒక్క గూగుల్‌ అకౌంట్ తో మీ డేటా అంతా స్టోర్‌ చేయబడుతుందని అంటున్నారు. దీంతోపాటు మీ వాయిస్‌ను కూడా గూగుల్‌ రికార్డు చేస్తుందంటున్నారు. ఈ విషయంపై గతంలోనే గూగుల్‌పై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు రాగా… వాయిస్‌లు రికార్డు చేయడాన్ని గూగుల్‌ సమర్థించుకుంది. యూజర్ల వాయిస్‌లను థార్డ్‌ పార్టీ సంస్థలకు ఇవ్వడంపై అనేకమంది ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దీనికి బదులిచ్చిన గూగుల్‌.. తాము వాయిస్‌లను రికార్డు చేస్తున్నది నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు అని చెబుతూ.. వ్యక్తిగత సమాచారాన్ని బహిరంగం చేస్తోంది. ఆ సమాచారాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకుంటోందని కూడా గూగుల్‌ సంస్థపై అనేక ఆరోపణలు ఉన్నాయి. చివరిగా.. సాంకేతికత విస్తృతమైన తరుణంలో వ్యక్తిగత గోప్యత లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా నేరాలకు పాల్పడేవారు ఏస్థాయి వారైనా తప్పించుకునేందుకు అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *